కరోనా వైరస్ వ్యాపించకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్రప్రభుత్వం పేదలను పట్టించుకోవటంలేదని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తన ఐదుగురు పిల్లలకు తిండిపెట్టలేక నదిలో తోసేసిందన్న వార్తలను ఉటంకిస్తూ, చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా పేదలు ఎలా బతుకుతారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌చేశారు.
రాష్ట్రాలు తమకు ఉన్న తక్కువ వనరులతో కొంతవరకు డబ్బు, తిండి గింజలు ఇస్తున్నాయి. కేంద్రప్రభుత్వం మాత్రం పేదలకు డబ్బులు ఇవ్వటంలేదు. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చిదంబరం సోమవారం ట్వీట్ చేశారు. కేంద్రం 2020-21 సంవత్సరానికి రూపొందించిన రూ.30 లక్షల కోట్ల బడ్జెట్‌లో పేదలకు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు రూ.65000 కోట్లు సర్దుబాటు చేయవచ్చని అన్నారు.