కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి. కరోనా వైరస్‌కు సంబంధించి ప్రచారమయ్యే వదంతులను నమ్మొద్దని సూచిస్తున్నాయి. అంతేగాక ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా ఎవరైనా వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. అయినాసరే కొందరు ఆకతాయిలు తమ బుద్ధి మార్చుకోవడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియోలను ప్రచారం చేస్తూ జనాన్ని భయపెడుతున్నారు.
తాజాగా ఇలాంటిదే ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. దేశంలో త్వరలోనే లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణ ఆ ఆడియో క్లిప్పింగుల్లో ఉన్నది. అయితే ఇది ఒట్టి అబద్ధమని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. జనం ఇలాంటి వదంతులు నమ్మవద్దని సూచించింది. దేశంలో ఇప్పటికప్పుడు లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఏమీ లేదని, ఎవరో ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఈ ఆడియోను సృష్టించి ఉంటారని కేంద్రప్రభుత్వ పరిధిలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) అభిప్రాయపడింది. ఫేక్ న్యూస్‌ను ఎవరు ప్రచారం చేయొద్దని, అలాంటి న్యూస్‌ను ఫార్వర్డ్ చేసినా సరే చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని పీఐబీ హెచ్చరించింది.