నిర్లక్ష్యం వద్దు

వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత నియంత్రణ, వ్యక్తిగత క్రమశిక్షణ.. ఈ మూడింటినీ పాటించడమే కరోనా కట్టడికి సరైన పరిష్కారం. ముందుజాగ్రత్త పడటమే రాష్ర్టానికి శ్రీరామరక్ష. అన్నింటికీ మించి మంది గుమిగూడకుండా ఉండటమే కరోనాకు అసలైన మందు. మాకేమయితదిలే అన్న నిర్లక్ష్యం పనికిరాదు’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. కరీంనగర్‌లో ఇండోనేషియా నుంచి వచ్చిన ఎనిమిది మంది విదేశీయులకు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాలను అప్రమత్తంచేశామని చెప్పారు. మార్చి 1 తర్వాత విదేశాలనుంచి రాష్ర్టానికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తించి పరీక్షిస్తామన్నారు. ప్రాథమికస్థాయిలో నిర్లక్ష్యం వహించిన దేశాలు ఇప్పుడు బాధలు అనుభవిస్తున్నాయని, కఠినచర్యలు తీసుకొన్న దేశాలు మంచిగా ఉన్నాయని పేర్కొన్నారు.


తెలంగాణలో కూడా ప్రభుత్వం కరోనా నియంత్రణకు అన్నిరకాల చర్యలను కఠినంగా చేపట్టిందని చెప్పారు. అంతమాత్రాన ఎవరూ భయపడాల్సిన పనిలేదని స్పష్టంచేశారు. సూపర్‌మార్కెట్లు, షాపింగ్‌మాల్స్‌ యథాతథంగా పనిచేస్తాయని, నిత్యావసర సరుకులకు ఎలాంటి లోటు ఉండదని పేర్కొన్నారు. రియల్‌ఎస్టేట్‌, వ్యవసాయ సంబంధ లావాదేవీలు కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని మతాల ప్రార్థనాలయాలను మూసివేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణపై గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..