సోమశిల-శ్రీశైలం క్రూయీజ్‌ బోట్‌ ప్రయాణం ప్రారంభం

సోమశిల-శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభమైంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిల వద్ద ఏర్పాటు చేసిన క్రూయీజ్‌ బోట్‌ను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నేడు ప్రారంభించారు. అదేవిధంగా వాటర్‌ స్పోర్ట్స్‌, బోటింగ్‌, కాటేజీలు, ఇతర పర్యాటక సౌకర్యాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


నల్లమల దట్టమైన అరణ్యం.. ఒకప్పుడు పగలు పోలీసులు.. రాత్రుళ్లు మావోయిస్టులు ఒకరివెనుక ఒకరు.. ఒకరి కోసం మరొకరు వెదుకులాడిన ప్రాంతం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంతో గూడేలు గజగజవణికిపోయేవి. పోలీసుల బూట్ల చప్పుళ్లు, మావోయిస్టుల తుపాకుల శబ్దాల కారణంగా కృష్ణమ్మ జల సవ్వడులు.. నల్లమల కొండల అందాలను కారడవి కప్పివేసింది. కానీ, తెలంగాణ స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ సమీపంలో సోమశిల సోమేశ్వరాలయం, సోమేశ్వరుడి పాదాలను కడుగుతున్నట్టుగా ఉండే కృష్ణానది.. అక్కడి నుంచి తూర్పువైపు శ్రీశైలం రిజర్వాయర్ వరకు సాగే ప్రయాణం మధురానుభూతిని కల్పించనున్నది. నదిలో నీరు పుష్కలంగా ఉండటంతో ఎనిమిది నెలలపాటు జలవిహారం చేసేందుకు అవకాశం ఉన్నది. ఇప్పటికే తెలంగాణ పర్యాటక సంస్థ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంవరకు రెండు లాంచీలను నడుపుతుండగా.. ఇప్పుడు కొల్లాపూర్ సమీపంలోని పుణ్యక్షేత్రమైన సోమశిల, అమరగిరి తదితరప్రాంతాల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది. నల్లమల అందాలను వీక్షిస్తూ సోమశిల నుంచి శ్రీశైలం రిజర్వాయర్ చేరుకునే అవకాశం కల్పిస్తున్నది.

గోదావరిలో పాపికొండల ఎత్తు సముద్రమట్టానికి రెండొందల మీటర్ల కన్నా మించదు. కానీ, సోమశిల నుంచి శ్రీశైలం వరకు విస్తరించి ఉన్న అమరగిరులు 400 మీటర్ల ఎత్తులో కనువిందు చేస్తాయి. సోమశిల వద్ద నీటిమట్టం 300 అడుగులు ఉంటుంది. ఫిబ్రవరిలో 100 అడుగులకు నీటిమట్టం తగ్గినా ప్రయాణానికి ఏ ఆటంకమూ ఉండకపోగా.. అమరిగిరులు ఇంకా ఎత్తుగా కన్పిస్తూ ఆకట్టుకుంటాయి.