గ్రీన్‌ ఛాలెంజ్‌పై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ప్రశంసలు

టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఛాలెంజ్‌పై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. డిప్యూటీ చైర్మన్‌కు గ్రీన్‌ ఛాలెంజ్‌కు సంబంధించిన వివరాల బ్రోచర్‌ను ఎంపీ బండా ప్రకాశ్‌ నేడు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ బండా ప్రకాశ్‌ ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నట్లు హరివంశ్‌ పేర్కొన్నారు. ఒకరు మొక్క నాటి మరో ముగ్గురిని మొక్కలు నాటమని పిలుపునివ్వడం నిజంగా గొప్ప పర్యావరణహిత కార్యక్రమం అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కాలుష్య నివారణకు, వాతావరణ సమతుల్యతకు, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ ఉత్పత్తికి గ్రీన్‌ ఛాలెంజ్‌ ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.